రాయచోటి ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పేంటి?

రాయచోటి ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పేంటి?
x
Highlights

ఆయన తన నియోజకవర్గానికి ఏదో చేద్దామనుకున్నారు. అభివృద్ది పనులకు శంకుస్థాపన కూడా చేయించారు. కానీ సీన్ కట్‌ చేస్తే, ఆయనకు కొత్త తలనొప్పి మొదలైంది. అది...

ఆయన తన నియోజకవర్గానికి ఏదో చేద్దామనుకున్నారు. అభివృద్ది పనులకు శంకుస్థాపన కూడా చేయించారు. కానీ సీన్ కట్‌ చేస్తే, ఆయనకు కొత్త తలనొప్పి మొదలైంది. అది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల ఆందోళనకు కారణమైంది. కానీ అలాంటిదేంలేదని, ఆయన అంటున్నా, నిరసనలు ఆగడం లేదు. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు వచ్చిన కొత్త చిక్కేంటి? ఎందుకంత రగడ జరుగుతోంది?

రాయచోటి. కడప జిల్లాలో కరువుకు కేరాఫ్‌గా పేరొందిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గొలుపొందిన నాటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కలియ తిరుగుతూ అభివృద్దికి సంబంధించిన ప్రతిపాదనలతో నిత్యం సిఎం క్యాంపు ఆఫీసు, జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 24న నియోజకవర్గంలో అభివృద్ది పనులకు సంబంధించి శంకుస్థాపన చేయించేందుకు స్వయానా సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. సిఎం రాకతో నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు తీయడంతో పాటు రాజకీయంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి ఎంతగానో క్రెడిట్ దక్కుతుందని ఆశించారు. కానీ ఆయన ఆశించిన దానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయంగానే కాకుండా అన్ని వర్గాల నుంచి, శ్రీకాంత్‌కు కొత్త తలనొప్పు మొదలైంది.

రాయచోటి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల, 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఉన్నత పాఠశాల. ఎంతోమందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దింది. అలాంటి కళాశాల మైదానం ఇప్పుడు ఓట్ల రాజకీయాలకు బలవుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజకీయ పావులా మారుతోంది.

స్వాతంత్య్రానికి ముందే 1930లో ఈ కళాశాలకు, ఆనాడే నాలుగు ఎకరాల విలువైన భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ వంద కోట్లలో ఉంటుంది. అయితే 1998 నుంచి వక్ప్‌ బోర్డు, విద్యాశాఖల మధ్య వివాదం సాగుతోంది. దీంతో సమస్య కాస్త హైకోర్టుకు వెళ్లింది. అయితే, 2019 మార్చిలో గత ప్రభుత్వం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విద్యాశాఖ సెక్రటరీలు ఈ స్థలాన్ని మైనార్టీ సంక్షేమం కోసం వక్ఫ్‌ బోర్డుకు ఇస్తే ఎలాంటి ఇబ్బందిలేదని ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆ నివేదిక నాడు అమల్లోకి రాకపోయినా, గతనెల 24వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాయచోటిలో జరిగిన వివిధ అబివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూనియర్‌ కళాశాలలో జరిగిన బహిరంగసభ వేదికగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం జూనియర్‌ కళాశాలకు చెందిన నాలుగు ఎకరాలు వక్ఫ్‌ బోర్డుకు కేటాయిస్తామని, రేపటి నుంచే ఆ పనులు మొదలుపెడతామని ఆ వేదికగా ప్రకటించారు. అందులో భాగంగానే విలువైన కళాశాల స్థలాన్ని వక్ఫ్‌ బోర్డుకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా రాయచోటిలో ఆందోళనలు, నిరసనలకు తెరలేసింది.

రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ పట్టణంలో ఆందోళనలు, నిరసనలు, మహార్యాలీలు హోరెత్తుతున్నాయి. ఓ వైపు ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, బీజేపీ నేతలు, విద్యార్థి జేఏసీ నాయకులు మహార్యాలీ చేపట్టారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ నిరసనలకు ముందుండి నాయకత్వం వహిస్తున్న మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకుడు.

ప్రభుత్వ కళాశాల స్థలం విషయంలో సిఎం వైఎస్ జగన్ ను తప్పుదారి పట్టించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నిరసనకారులు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యే, ప్రభుత్వ ఛీప్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కనపడటం లేదని ప్రజాసంఘాలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఇటీవల రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలం నాలుగు ఎకరాల్లో మహిళా డిగ్రీ కళాశాల, పీజీ సెంటరు ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీ, ప్రజలు కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు.

కానీ తనపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, తాను విద్యాలయాలు తెచ్చే వాడిని కానీ, మూయించే రకం కాదంటున్నారు శ్రీకాంత్ రెడ్డి. కేవలం తానంటే గిట్టని వాళ్లు ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారన్నారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని కోరుతున్నారు. కానీ ఈ ఒక్కస్థల వివాదం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని మాత్రం రాకీయంగా సమస్యల సుడిగుండంలో పడేసినట్లయ్యిందన్న ప్రచారం సాగుతోంది. సీఎం చేసిన ఒక్క ప్రకటన తనకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందనుకుంటే మరింత నష్టాన్ని కలిగించేలా తయారైంది. శ్రీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు నానాటికి తీవ్రమవుతూనే ఉన్నాయి గానీ తగ్గుముఖం పట్టకపోవడంతో, ఆయనకు కూడా ఎటు పాలుపోవడం లేదు. నిత్యం ప్రచార మాధ్యమాల్లో కనిపించే శ్రీకాంత్ రెడ్డి కొద్ది రోజులుగా తెరవెనకే ఉండిపోతున్నారు. మరి రాజకీయాల్లో చాణక్యాన్ని చాటుకునే శ్రీకాంత్ రెడ్డి, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories