వి.ఆర్‌. కాలేజీ వేదికగా కోల్డ్‌ వార్‌ షురూ?

వి.ఆర్‌. కాలేజీ వేదికగా కోల్డ్‌ వార్‌ షురూ?
x
Highlights

నెల్లూరు జిల్లా అధికార పార్టీలో అంతర్యుద్ధం మొదలైందా...? తామంతా ఏకమంటూనే, నేతల మధ్య ఆధిపత్యపోరుకి తెర లేచిందా..? మొన్నటి రూరల్‌, సర్వేపల్లి శాసనసభ్యుల...

నెల్లూరు జిల్లా అధికార పార్టీలో అంతర్యుద్ధం మొదలైందా...? తామంతా ఏకమంటూనే, నేతల మధ్య ఆధిపత్యపోరుకి తెర లేచిందా..? మొన్నటి రూరల్‌, సర్వేపల్లి శాసనసభ్యుల మధ్య జరిగిన యుద్ధం ముగియక ముందే, మరో వార్‌ షురూ అయ్యిందా..? జిల్లాలో రెండు రోజులుగా అధికార పార్టీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇంతకి ఎవరి మధ్య ఈ వార్‌....కారణాలేంటి? దాని పరిణామాలేంటి?

రాజకీయాలకు రాజధాని నెల్లూరులో ఇప్పుడు సరికొత్త రాజకీయ అంతర్యుద్ధం మొదలైంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలు మరో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య తాజా వార్‌ స్టార్ట్‌ అయ్యింది. ఇందుకు వి.ఆర్‌.విద్యా సంస్థలు వేదికయ్యాయి. రెండేళ్లుగా వి.ఆర్‌.విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు ఆనం పెత్తనంపై అత్యున్నత ధర్మాసనం వరకు వెళ్ళి విజయం సాధించారు. వి.ఆర్‌.విద్యాసంస్థలకు పాత పాలక వర్గాన్ని రద్దు చేసింది కోర్టు. జాయింట్‌ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఇక్కడి నుంచి రాజకీయం మరింత వేడెక్కడం ప్రారంభించింది.

వి.ఆర్‌. విద్యా సంస్థల నూతన యాజమాన్యం కోసం ఎన్నికలు జరపాలని గత ఏడాది క్రితం సుప్రీం కోర్ట ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కసరత్తు మొదలైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వి.ఆర్‌.కళాశాల నూతన పాలక వర్గం కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పూర్వ విద్యార్థులు ఓటర్లుగా సభ్యత్వాలకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే సమయంలో జిల్లా అధికారులు పదేపదే మారడంతో ఎన్నికల క్రతువు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వి.ఆర్‌. విద్యాసంస్థల ఆర్థిక వ్యవహారాలు, కళాశాల పురోభివృద్ధికి అవాంతరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కళాశాల కోసం ఆది నుంచి ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రస్తుత రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రంగంలోకి దిగారు.

దాదాపు అయిదు దశాబ్దాలుగా ఆనం కుటుంబం వి.ఆర్‌.విద్యాసంస్థల పై పెత్తనం చేస్తోంది. సుదీర్ఘంగా 144 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల విద్యాసౌధానికి ఆనం కుటుంబమే యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తోంది. ఒకప్పటి ఆనం భక్తవత్సల రెడ్డి నుంచి ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కళాశాల కార్యనిర్వాహకులుగా కొనసాగుతూ వున్నారు. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్న రామనారాయణరెడ్డి, అంతకుముందున్న ఆనం కుటుంబీకుల మొత్తం పెత్తనం, ఆపివేయాలంటూ ఆనం వ్యతిరేక వర్గం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళింది.

తాజాగా వి.ఆర్‌.విద్యాసంస్థల నిర్వహణపై రూరల్‌ ఎమ్మెల్యేతో పాటు మంత్రి అనిల్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి, ప్రత్యేక అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్ కుమార్ తో కలిసి కళాశాలను పరిశీలించారు. పాలనా తీరును అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వి.ఆర్‌. విద్యాసంస్థలకు పూర్వవైభవం తెస్తాం. ఇందులో ఎవరి ప్రమేయాలు ఉండబోవు. ఎవరికి భయపడాల్సిన పనిలేదు అంటూ పరోక్షంగా మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు. మరోవైపు వి.ఆర్‌.విద్యాసంస్థలపై ఇప్పటి వరకు ఉన్న పెత్తనాలను సహించం. కొత్త యాజమాన్యంతో కళాశాలను అభివృద్ధి చేస్తాం. ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా తమ వంతు సహకారాన్ని అందిస్తానంటూ పాత పాలక వర్గంపై ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. ఇప్పుడివే రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వి.ఆర్‌.విద్యా సంస్థలు వేదికగా ఆనం వర్సెస్‌ మంత్రి అనిల్‌ అన్నట్లుగా ఉన్నాయి తాజా పరిణామాలు. వి.ఆర్‌.కళాశాల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి అనిల్‌ తనదైన స్టైల్‌లో పరోక్షంగా ఆనంకు వ్యతిరేకంగా మాట్లాడారు. పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వి.ఆర్‌.కళాశాల మైదానాన్ని ఇకపై రాజకీయ పార్టీలకు వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కళాశాల నిర్వాహకులకు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చారు. ఎవరి పెత్తనాన్ని సహించం. విద్యాశాఖ మంత్రి ద్వారా సంస్కరణలకు శ్రీకారం చుడతామన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఆనంకు వ్యతిరేక ధోరణిలోనే సాగిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి నెల్లూరు వి.ఆర్‌.విద్యాసంస్థలు మరోసారి అధికార వైసీపీలో ఆధిపత్య రాజకీయాలకు తెరలేపాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories