జనసేనలో జేడీ కథేంటి?

జనసేనలో జేడీ కథేంటి?
x
జనసేనలో జేడీ కథేంటి?
Highlights

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడెక్కడ? పార్టీ కార్యక్రమాల్లో ఆ‍యనెందుకు కనపడ్డం లేదు? పవన్‌తో విభేదాలు సమసిపోయాయి అంటున్నా, క్రియాశీలకంగా ఎందుకు...

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడెక్కడ? పార్టీ కార్యక్రమాల్లో ఆ‍యనెందుకు కనపడ్డం లేదు? పవన్‌తో విభేదాలు సమసిపోయాయి అంటున్నా, క్రియాశీలకంగా ఎందుకు కనపడ్డంలేదు? పార్టీనే దూరం పెడుతోందా? లేదంటే ఆయనే దూరం జరుగుతున్నారా? జనసేనలో జేడీ గురించి జరుగుతున్న చర్చేంటి?

విశాఖపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడెక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనపడకపోవడం అంతటా చర్చనీయాంశమైంది. అసలాయన పార్టీలో వున్నారా లేదా అన్న సందేహం కూడా జనాలకే కాదు, పార్టీ కార్యకర్తల్లోనూ వుంది.

రాజధాని ఆందోళన ఇంతెత్తున ఎగసిపడుతోంది. ఒకరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కానీ జేడీ ఎక్కడా కనపడలేదు. అదే కాదు, అంతకుముందు జరిగిన పార్టీ కార్యక్రమాలు వేటిలోనూ జేడీ కనిపించిన దాఖాల్లేవు. వైజాగ్‌ లాంగ్‌ మార్చ్‌ ముందు రోజు, ఆ తర్వాతి రోజు జేడీ కనిపించారే కానీ, లాంగ్‌ మార్చ్‌లో మాత్రం పాల్గొనలేదని పార్టీ వర్గాలే చెప్పాయి. అటు రాజధాని ఆందోళనలు, ఇటు పార్టీ కార్యక్రమాలు వేటిలోనూ జేడీ పెద్దగా పాల్గొనకపోవడంతో, పార్టీలో జేడీ ఉనికిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

జనసేనకు సంబంధించి ప్రతి కార్యక్రమంలోనూ పవన్ కల్యాణ్‌ తర్వాత నాదెండ్ల మనోహర్ మాత్రమే కనపడ్తున్నారు. సీబీఐలో పవర్‌‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా జేడీకి కూడా యూత్‌లో క్రేజ్‌ వుంది. వైజాగ్‌ ఎంపీ పోరులోనూ గౌరవమైన ఓట్లు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు జేడీ. ఈయనే పార్టీ కార్యక్రమాలకు పోవడం లేదా, లేదంటే జేడీనే పార్టీ దూరం పెడుతోందా అన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. కానీ తనను పార్టీనే దూరం పెడుతోందని, తన సన్నిహితులతో ఆవేదన పంచుకున్నారట జేడీ.

రాజకీయాల్లో సీనియర్‌ కాకపోయినా, తనకంటూ సమాజంలో ఒక ఇమేజ్‌ వుందంటున్న జేడీ, పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా, పార్టీ విధానాలు, నిర్ణయాల్లోనూ తనకు పాత్రలేకుండా చేస్తున్నారని లోలోపల రగిలిపోతున్నారట. ఇప్పుడు రాజధానిపై పార్టీ విధానం ఎలా వుండాలి, ప్రాంతాలకు అతీతంగా ఎలా ముందుకెళ్లాలి అనే ఆలోచనలో తనకేమాత్రం భాగస్వామ్యం కల్పించడం లేదని ఫీలవుతున్నారట జేడీ. అయితే తాను విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహించినప్పటికీ, రాజధాని విషయంలో మనసులో మాట చెప్పారు జేడీ. పాలనా వికేంద్రీకరణ కంటే అభివృద్ది వికేంద్రీకరణే ముఖ్యమన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో ఏ ప్రాంతానికా ప్రాంతంలో అభివృద్దికి బాటలెయ్యాలన్నారు. ఒకరకంగా విశాఖను రాజధానిగా వ్యతిరేకించి, పార్టీలైన్‌లోనే మాట్లాడారు జేడీ. కానీ ఇది తన అభిప్రాయమని పదేపదే చెప్పడం ద్వారా, పార్టీ లైన్‌తో తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు.

ఇలా జనసేనలో జేడీ ఒంటరయ్యారు, దూరమయ్యారన్న వార్తల నేపథ్యంలో, ఒక వార్త మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్‌తో పెరిగిన గ్యాప్‌ కారణంగా వచ్చే ఎన్నికల్లో జేడీకి జనసేన టికెట్‌ రాదని అందరూ అనుకుంటున్న తరుణంలో, తిరిగి ఆయన వైపే పవన్‌ మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, విశాఖ లోక్‌సభ జనసేన ఇంఛార్జ్‌గా లక్ష్మీనారాయణనే నియమించారు. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణే అనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నాలుగున్నరేళ్లలో ఏం జరుగుతుందో, ఏమో కానీ, ఇప్పటికైతే విశాఖ ఎంపీ నియోజకవర్గానికి జేడీనే ఇన్‌ఛార్జిగా నియమించింది జనసేన. ఈ చర్యతో జేడీకి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పుకోవడానికి అవకాశం లభించినా, మరి పార్టీ కార్యక్రమాల్లో జేడీని ఎందుకు భాగస్వామ్యం చెయ్యడం లేదన్న ప్రశ్నకు, జనసేన అధినేత సమాధానమేంటన్నది ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి జనసేనలో జేడీ వున్నారంటే వున్నారు, లేదంటే లేదన్నట్టుగా పార్టీ వ్యవహారం కనిపిస్తుంటే, దీనికంతటికీ పార్టీ అధినాయత్వకమే కారణమన్నట్టుగా జేడీ వేలెత్తి చూపుతున్నట్టుగా వుంది. చూడాలి, జనసేనలో జేడీ ప్రయాణం ఎటువైపు మలుపు తిరుగుతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories