AP News: ఎన్నికలకు సిద్ధమవుతున్నజనసేన, టీడీపీ కూటమి

Janasena and TDP Alliance Preparing For AP Elections
x

AP News: ఎన్నికలకు సిద్ధమవుతున్నజనసేన, టీడీపీ కూటమి

Highlights

AP News: ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు

AP News: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ - జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు -జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటి అయ్యారు.ఇదే విషయంపై త్వరలో మరోసారి చంద్రబాబు - పవన్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా రెండు సార్లు సమావేశం అయ్యారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి. ఏ ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా వారు ఓ అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే తర్వాత అసంతృప్తుల్ని బుజ్జగించవచ్చని అనుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ ఇటీవల రెండు సీట్లు చేస్తున్నామని ప్రకటించారు. అందులో ఒకటి రాజోలు, రెండోది రాజా నగరం. అంతకు ముందు చంద్రబాబునాయుడు ప్రచార సభల్లో మండపేట, అరకుల నుంచి అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణమవుతుంది. పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లు కేటాయించుకుని అభ్యర్థుల్ని ప్రకటించుకోవడం ఏమిటని పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పవన్ సర్ది చెప్పారు. తాను కూడా రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. తర్వాత నాగేంద్ర బాబు చర్య, ప్రతి చర్య అంటూ పోస్టింగ్ పెట్టడం కూడా వివాదాస్పదమయింది. చివరికి అవి పెరగకుండా చూసుకోవాలని రెండు పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

సీట్ల సర్దుబాటు కసరత్తు నిమిత్తమే రా..కదలి రా.. సభలకు చంద్రబాబు విరామం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో రా..కదలి రా సభలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల 4వ తేదీన మిగిలిన చోట్ల నుంచి రా..కదలిరా సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు ప్రకటన జరిగాకే తన పర్యటనలను పవన్ ప్రారంభించనున్నట్టు సమాచారం. వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి పవన్ పర్యటనలు ప్రారంభం కానున్నట్టు ఇప్పటికే జనసేన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైనా చంద్రబాబు - పవన్ తుది కసరత్తు చేసే అవకాశం ఉంది.

నిజానికి టీడీపీ, జనసేన ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయని.. అంతర్గతంగా ఏ ఏ సీట్లు అన్నది కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. అభ్యర్థుల అంశంపైనా ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అయితే బీజేపీతో జనసేన పార్టీ చర్చలు జరుపుతోంది. తాము, జనసేన పార్టీ పొత్తులో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో అధికారికంగా పొత్తుల ప్రకటన చేయడంలో ఆలస్యం అవుతుంది. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని.. ప్రచారం జరుగుతోంది. వెళ్లినా వెళ్లకపోయినా.. ఫిబ్రవరి మొదటి వారంలో పొత్తుల ప్రకటన, సీట్ల సర్దుబాటు అంశాలపై రెండు పార్టీలు ఓ ప్రకటనచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల 4 నుంచి మిగిలిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో రా కదలిరా సభలు పెట్టనున్నారు. ఫిబ్రవరి 4న అనకాపల్లి నుంచి పవన్ కల్యాణ్ పర్యటనలు ప్రారంభించే అవకాశముంది. ఉమ్మడిగా రాష్ట్ర స్థాయి సభల్ని నిర్వహించాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. వీటిపైన ఫిబ్రవరి మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories