ISRO: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 17న శ్రీహరికోట నుంచి ప్రయోగం

ISRO Ready for Another Key Launch
x

ISRO: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 17న శ్రీహరికోట నుంచి ప్రయోగం

Highlights

ISRO: జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 14 రాకెట్ ద్వారా.. ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం

ISRO: నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్దమయింది. వాతావరణానికి సంబంధించిన ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ - త్రీ డీఎస్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలకు కూడా ఉపకరిస్తుంది. ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 17న ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రమయిన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F 14 నుంచి ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు... ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో జీఎస్ఎల్వీ - ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన పనుల్లో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇప్పటికే రెండు దశల అనుసంధాన పనులు పూర్తి కాగా మూడో దశ పనులు జరుగుతున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తుగా సమాచారం తెలుసుకునే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన 19 పేలోడ్‌లను కూడా పంపుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు... ఇస్రో ఈనెల 17న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ - ఎఫ్ ఫోర్టీన్ ద్వారా‌ మరో రాకెట్‌ను ప్రయోగించనుంది. ఇన్సాట్ - త్రీ డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది. జీఎస్‌ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వాతావరణ పరిశీలన కోసం ఇస్రో ఈ 'ఇన్సాట్ - త్రీ డీఎస్' ఉపగ్రహాన్ని రూపొందించింది. మెరుగైన రీతిలో వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనాలతో పాటు భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణకు ఉపయోగ పడనుంది. వాతావరణ విపత్తులను మరింత మెరుగ్గా అంచనా వేసి... అప్రమత్తమవడం కూడా దీని ప్రధాన లక్ష్యం. కాగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ ప్రయోగానికి అవసరమైన నిధులను సమకూర్చింది. భారత వాతావరణ విభాగం, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ విభాగాలు వాతావరణ అంచనాల కోసం ఇన్సాట్ - త్రీ డీఎస్ డేటాను ఉపయోగించుకోనున్నాయి.

ఈ ఏడాది జనవరి తొలి రోజు ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ - సీ 58 రాకెట్‌ ద్వారా ఎక్స్‌పో శాట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపారు ఇస్రో శాస్త్రవేత్తలు... అదే ఉత్సాహంతో ఈ నెల 17న జీఎస్ఎల్వీ - ఎఫ్‌ 14 రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌ - త్రీ డీ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. గత నెల 27న బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి ఇన్‌శాట్‌ - త్రీ డీ ఉపగ్రహాన్ని షార్‌కు తీసుకొచ్చారు. క్లీన్‌రూమ్‌లో ఉపగ్రహాన్ని పెట్టి తుది పరీక్షలు నిర్వహించారు. దీన్ని హీట్‌షీల్డ్‌లో అమర్చి రాకెట్‌ శిఖర భాగాన అనుసంధానిస్తారు. 2 వేల 275 కిలోల బరువు గల ఇన్‌శాట్‌ - త్రీ డీ ఉపగ్రహం ద్వారా వాతావరణ పరిస్థితుల అంచనాతో పాటు విపత్తుల హెచ్చరికలను తెలుసుకోవచ్చు...

నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈనెల 17న జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్ 14 వాహక నౌకను రెండో ప్రయోగ వేదిక నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని షార్ సంచాలకుడు ఆర్ముగం రాజరాజన్ వెల్లడించారు. దీని ద్వారా అధునాతన ఇన్సాట్ - త్రీ డీఎస్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు.. జీఎస్ఎల్వీ - ఎఫ్ 14తో ఉపగ్రహ అనుసంధానం సజావుగా జరుగుతుందన్నారు. ఈ అధునాతన ఉపగ్రహాలు మెరుగైన కవరేజీ, బ్యాండ్ విడ్త్‌ను అందిస్తాయని వివరించారు. ఈ ఉపగ్రహం ద్వారా టెలికమ్యూనికేషన్స్, గ్రామీణ అనుసంధానం, విపత్తు నిర్వహణతో సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories