Pithapuram: కథ మళ్లీ మొదటికి.. పవన్ తప్పుకుంటే సీటు తనదే అంటున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

Former MLA Verma Is Arguing That The Seat Will Be His If Pawan Is Nominated
x

Pithapuram: కథ మళ్లీ మొదటికి.. పవన్ తప్పుకుంటే సీటు తనదే అంటున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

Highlights

Pithapuram: వర్మ కామెంట్స్‌తో అయోమయంలో జనసేన నేతలు

Pithapuram: పవన్ కల్యాణ్ పోటీకి రెడీ అవుతున్న పిఠాపురం అసెంబ్లీ సీటు పంచాయితీ మళ్లీ మొదటికి చేరింది. అవసరం అయితే కాకినాడ ఎంపీ బరిలో ఉంటానంటూ జనసేనాని చేసిన తాజా ప్రకటనతో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాను కాకినాడ ఎంపీ స్తానం నుంచి పోటీ చేస్తే.. పిఠాపురం అసెంబ్లీ రేసులో ఉదయ్ ఉంటారని పవన్ అనడం ఆజ్యం పోసినట్టైంది. పిఠాపురం అసెంబ్లీ పోటీ నుంచి పవన్ తప్పుకుంటే.. ఆ స్థానం తనదే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ. తనకు కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. పవన్‌ పోటీ చేస్తే ఆయన గెలుపు కోసం కృషి చేస్తా లేకపోతే తానే పోటీలో ఉంటా అంతేకాని మూడో వ్యక్తికి అవకాశమే లేదని తెగేసి చెబుతున్నారు వర్మ.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు సత్యనారాయణ వర్మ. ఐనా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అప్పటి నుంచి కృషి చేస్తూ వచ్చారు. మొదటి నుంచి పిఠాపురం అభ్యర్థిని తానే అంటూ ప్రచారం చేసుకున్నారు వర్మ. కానీ టీడీపీతో జనసేన పొత్తు ఖరారు కావడం.. సీట్ల పంపకాల్లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ పోటీకి మొగ్గు చూపడంతో వర్మ ఆశలకు గండిపడినట్టైంది. పవన్‌ కల్యాణ్‌ను కూటమి అభ్యర్థిగా ప్రకటించడాన్ని మొదట్లో వ్యతిరేకించారు వర్మ. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..వర్మ వర్గం ఆందోళలకు దిగింది. దీంతో పిఠాపురం పంచాయితీ ఉండవల్లికి చేరింది. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి.. ఎమ్మెల్సీ హామీతో చివరకు వెనక్కి తగ్గారు వర్మ. పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని, పార్టీ కేడర్‌ను కలుపుకుని వెళ్తామని ఒప్పుకున్నారు.

ఇదిలా ఉంటే.. నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొత్తం సీన్ రివర్స్ అయింది. ఓ వైపు పిఠాపురం నుంచి పోటీకి రెడీ అవుతూనే.. అవసరం అయితే కాకినాడ ఎంపీగా బరిలో ఉంటానంటూ మనసులో మాట బయటపెట్టారు పవన్. ఇప్పటికే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తంగెళ్ల ఉదయ్‌ను..పిఠాపురం స్థానానికి పంపిస్తానని అన్నారు. దీంతో చిచ్చురాజుకుంది. మాజీ ఎమ్మల్యే వర్మ మళ్లీ కొత్తగా పాత రాగం ఆలపించడం మొదలుపెట్టారు. పవన్ తప్పకుంటే.. పిఠాపురాన్ని ఓ పట్టుపడతా అంటున్నారు. అంతేకాని ఆ స్థానాన్ని మరొకరికి ఇచ్చేదే లేదు అంటున్నారు. దీంతో పిఠాపురంలో కూటమి నేతలను ఆయోమయంలో పడేసినట్టు అయింది. ఇంతకు పవన్ పిఠాపురంలోనే పోటీ చేస్తారా లేక కాకినాడ ఎంపీగా రంగంలోకి దిగుతారా.? ఒకవేళ పిఠాపురంలో పవన్ పోటీ చేయకుండా తంగెళ్ల ఉదయ్‌ పేరును అనౌన్స్.. టీడీపీ నేత వర్మ అందుకు సహకరిస్తారా..? ఆయన తిరుగుబాటు ఎగేసి.. రెబల్‌గా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అనే గందరగోళం నెలకొంది కూటమి నేతల్లో.

Show Full Article
Print Article
Next Story
More Stories